భారతదేశం, జూలై 30 -- తిరుమల శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించేందుకు కొందరు సైబర్ ముఠాలు మళ్లీ హల్చల్ చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా రూపొందించిన ఒక నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు బుధవారం గుర్తించారు. "ttddevasthanam.online" అనే పేరుతో చలామణి అవుతున్న ఈ నకిలీ వెబ్‌సైట్‌పై భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్ రూపకల్పనను, లోగోను యాజిటీజ్‌గా కాపీ చేస్తూ కేవలం డొమైన్ పేరులో చిన్న చిన్న మార్పులతో ఈ నకిలీ సైట్‌ను తెరిచారు. ఇందులో రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, వివిధ రకాల ఆన్లైన్ సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ తప్పుడు సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు...