భారతదేశం, నవంబర్ 6 -- డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో గురువారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించి అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు...